Donga Naa Koduku Review
‘లిటిల్ హార్ట్స్’ లాంటి క్యూట్ లవ్ స్టోరీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి మొదటి చిత్రంతోనే సూపర్ హిట్ అందుకున్న యూట్యూబర్ మౌళి, ఇప్పుడు ‘DNK’ (దొంగ నా కొడుకు)తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయడం, శ్రీను కంభాల లాంటి కొత్త దర్శకుడు దీన్ని డైరెక్ట్ చేయడంతో సహజంగానే కాస్త అంచనాలు ఏర్పడ్డాయి. మరి క్రైమ్ కామెడీ జానర్లో వచ్చిన ఈ చిత్రం ఏ మేరకు మెప్పించింది? మౌళి ఖాతాలో మరో హిట్ పడిందా లేదా అనేది ఈ సమీక్షలో చూద్దాం.

కథ:
డిగ్రీ మధ్యలోనే వదిలేసి, జల్సాలకు అలవాటు పడిన కుర్రాడు ఈశ్వర్ (మౌళి). తల్లిదండ్రులు (అలీ, రజిత) ఎంత మందలించినా పట్టించుకోకుండా ఆన్లైన్ గేమ్స్, క్రికెట్ బెట్టింగ్స్ పిచ్చితో అడ్డదారులు తొక్కుతుంటాడు. ఈ క్రమంలో దీపు (సుస్మిత శెట్టి) అనే ఓ ధనవంతురాలితో అతడికి పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారుతుంది. అయితే దీపు నుంచి ఏకంగా పది లక్షలు అప్పుగా తీసుకున్న ఈశ్వర్, ఆ డబ్బు మొత్తం బెట్టింగ్‌లో పోగొట్టేస్తాడు. ఈ విషయం తెలుసుకున్న దీపు తండ్రి పుల్లయ్య (రఘుబాబు) రంగంలోకి దిగి, తన డబ్బు వెంటనే కట్టేయాలని వార్నింగ్ ఇస్తాడు. ఆ భారీ అప్పు తీర్చడం కోసం ఈ హీరో ఎలాంటి మార్గం ఎంచుకున్నాడు? జ్యువెలరీ షాప్ దొంగతనంలో అతడు ఎలా ఇరుక్కున్నాడు? అసలు ఆ దోపిడీ చేసింది ఎవరు? చివరకు ఈ పద్మవ్యూహం నుంచి హీరో ఎలా బయటపడ్డాడు? అనేదే మిగిలిన స్టోరీ.
స్క్రీన్ ప్లే:
టాలీవుడ్లో క్రైమ్ కమ్ కామెడీ నేపథ్యంలో వచ్చిన చిత్రాలు చాలా వరకు ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేశాయి. అయితే అలాంటి సినిమాలకు ప్రాణం పోసేది కేవలం ఆకట్టుకునే స్క్రీన్‌ప్లే మాత్రమే. ఈ సినిమా దర్శకుడు శ్రీను తీసుకున్న మూలకథ బాగానే ఉన్నప్పటికీ, దాన్ని తెరపై నడిపించిన విధానం మాత్రం తీవ్రంగా నిరాశపరుస్తుంది. ఈ జానర్‌కు కావాల్సిన కొత్తదనం ఏ కోశానా కనిపించదు. పైగా నవ్వించడం కోసం డబుల్ మీనింగ్ డైలాగులు, గే క్యారెక్టర్లను వాడుకోవడం అసహ్యంగా అనిపిస్తుంది. మైత్రీ మూవీస్ లాంటి అగ్ర సంస్థ నిర్మించిన చిత్రంలో ఇలాంటి పేలవమైన రైటింగ్ ఉండటం విచారకరం. దర్శకుడు తన సొంత టాలెంట్ వాడకుండా పాత హిట్ సినిమాల్లోని పాపులర్ డైలాగులు, సీన్లను యథాతథంగా వాడేసుకున్నాడు. ఖడ్గం, శివాజీ, నువ్వు నాకు నచ్చావ్, బిగిల్, ఓజీ, చంద్రముఖి చిత్రాల రిఫరెన్సులతో చేసిన స్పూఫ్‌లు చిరాకు తెప్పిస్తాయి. అయితే అక్కడక్కడా కొన్ని మలుపులు మాత్రం కాస్త రిలీఫ్ ఇస్తాయి. ముఖ్యంగా లాఫింగ్ బుద్ధా విగ్రహం చుట్టూ అల్లిన డ్రామా, దానికి ముగింపు ఇచ్చిన తీరు మెప్పిస్తుంది. తొలి చిత్రంలో అమాయకత్వంతో ఆకట్టుకున్న మౌళికి, ఇందులో అనవసరమైన మాస్ ఇమేజ్ తగిలించే ప్రయత్నం చేశారు. అవసరం లేని చోట స్లో మోషన్ షాట్స్, భారీ ఎలివేషన్స్ ఇచ్చి సినిమాను పూర్తిగా ట్రాక్ తప్పించారు. ఎక్కడా ఆసక్తి రేకెత్తించని సీన్లు, పాతకాలం నాటి జోకులతో ఓవరాల్‌గా ఈ సినిమా ఒక రొటీన్ వ్యవహారంగా, సాగదీతగా సాగుతుంది.

నటీనటులు:
హీరో మౌళి తనదైన కామెడీ టైమింగ్‌తో సినిమాను నిలబెట్టడానికి శతవిధాలా ప్రయత్నించాడు. కానీ అతడి క్యారెక్టరైజేషన్లో సహజత్వం లోపించడం వల్ల ఆశించిన స్థాయిలో పండలేదు. నాయిక సుస్మిత శెట్టికి కేవలం ఆటపాటలకే పరిమితమైన రోల్ దక్కింది, నటన పరంగా ఆమె పెద్దగా చేసిందేమీ లేదు. కామెడీ విలన్‌గా భద్రంను తీసుకోవడం సరైన ఎంపిక కాదు, ఆ పాత్రకు అతడు ఏమాత్రం సూట్ కాలేదు. అలీ, రఘుబాబు, రజిత, ప్రియ వంటి సీనియర్ యాక్టర్స్ ఉన్నప్పటికీ వాళ్లకు మూస పాత్రలే దక్కాయి. పైగా తెరపై ప్రతి ఒక్క నటుడు మితిమీరిన ఓవర్ యాక్షన్‌తో విసిగించారు.
టెక్నికల్ టీం:
సాంకేతిక విభాగం విషయానికి వస్తే, సంగీత దర్శకుడు సింజిత్ ఎర్రమిల్లి అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా లౌడ్‌గా ఉండి కథకు ఏమాత్రం సింక్ అవ్వలేదు. పాటలు కూడా ఏమాత్రం గుర్తుంచుకునేలా లేవు. సినిమాటోగ్రాఫర్ సూర్య బాలాజీ పనితనం ఉన్నంతలో పర్వాలేదనిపిస్తుంది. నిర్మాణ విలువల పరిమితుల్లో ఆయన కెమెరా వర్క్ డీసెంట్‌గా ఉంది. శ్రీధర్ సోంపల్లి ఎడిటింగ్ ప్రథమార్థంలో నీట్‌గా ఉన్నప్పటికీ, ద్వితీయార్థం, ప్రత్యేకించి క్లైమాక్స్ సన్నివేశాల్లో గందరగోళంగా అనిపిస్తుంది. దర్శకుడు శ్రీను కంభాల రైటింగ్, మేకింగ్ రెండు విభాగాల్లోనూ ఫెయిల్ అయ్యాడు. కేవలం హీరో మౌళికి ఉన్న మునుపటి క్రేజ్ మీద ఆధారపడి నిర్మాతలు ఈ ప్రాజెక్ట్ చేసినట్లు స్పష్టమవుతుంది.
చివరగా:
ఓవరాల్ గా DNK.. ఆడియన్స్‌కు అడ్డంగా దొరికిపోయిన దొంగ..
