Scene Review
2026లో మంచి జోరు మీదున్న సూర్య అప్పుడే మూడో సినిమాతో వచ్చేసాడు.. వరుస విజయాలతో జోరు మీదున్న ఈ హీరో సీన్ చూపిస్తున్నాడు ఇప్పుడు. మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:
షెర్లాక్ హోమ్స్ తరహాలో కేసులను చిటికెలో సాల్వ్ చేసే బ్రిలియంట్ కాప్ ప్రేమ్ రాజ్ (సూర్య). అయితే అతనికి బయటి ప్రపంచానికి తెలియని ఒక పెద్ద మైనస్ ఉంటుంది. ఆ లోపం ఎవరికీ తెలియకూడదనే ఉద్దేశంతో తన ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకుంటాడు. కానీ అతని బాస్ దాన్ని తిరస్కరిస్తాడు. సరిగ్గా అదే సమయంలో డబ్బు కోసం ఎంతటి దారుణాలకైనా ఒడిగట్టే ఈశ్వరన్ (నస్లెన్) అనే ఓ సైకో కిల్లర్ ఎంట్రీ ఇస్తాడు. తనకున్న లోపాన్ని దాచిపెడుతూనే ఆ కిరాతకుడిని ప్రేమ్ రాజ్ ఎలా పట్టుకున్నాడు, ఈ ఆపరేషన్ లో మాయ అతనికి ఏ విధంగా అండగా నిలిచింది, అసలు హీరోకు ఉన్న ఆ పెద్ద సమస్య ఏంటి అనేదే ఈ సినిమా మెయిన్ ప్లాట్.
స్క్రీన్ ప్లే:
హారర్, గ్యాంగ్ స్టర్ నేపథ్యాలకు కామెడీని జోడించి హిట్లు కొట్టిన జీతూ మాధవన్, ఈసారి క్రైమ్ థ్రిల్లర్ ను ఎంచుకుని తనదైన మార్క్ చూపించాడు. సాధారణంగా సీరియల్ కిల్లర్ సినిమాలు అనగానే రక్తపాతం, భయపెట్టే సీన్స్ గుర్తొస్తాయి. కానీ దర్శకుడు దానికి పూర్తి భిన్నంగా వినోదం, మాస్ అంశాలను కలిపి చాలా కూల్ గా సినిమాను మలిచాడు. ముఖ్యంగా ఇన్వెస్టిగేషన్ కోసం హీరో ఎంచుకునే బృందం అంతా ఏదో ఒక శారీరక లోపంతో బాధపడేవారే కావడం ఇందులో స్పెషల్ అట్రాక్షన్. హీరోయిన్ కు కూడా ఒక మైనస్ ఉంటుంది, అయినా సరే ఆమె హీరోకు కళ్ళుగా మారి అద్భుతంగా సపోర్ట్ చేస్తుంది. హీరో తల్లిదండ్రుల పాత్రలను కూడా వికలాంగులుగా చూపించి, వారి ద్వారానే దర్యాప్తును ఎంతో ఆసక్తికరంగా, వినోదాత్మకంగా నడిపించాడు. సినిమా ప్రారంభంలో కథ కాస్త నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపిస్తుంది. అయితే సీనియర్ నటుడు లాల్ పండించిన హాస్యం ప్రేక్షకులను అలరిస్తుంది. ఎప్పుడైతే హీరో అసలు బలహీనత తెరమీదకు వస్తుందో అప్పటినుంచి సినిమా పరుగులు పెడుతుంది. కిల్లర్, పోలీసుల మధ్య సాగే మైండ్ గేమ్ ఆడియన్స్ కు మంచి థ్రిల్ ఇస్తుంది. దర్శకుడు భారీ సెట్టింగుల జోలికి వెళ్లకుండా సినిమాను చాలావరకు హీరో ఇంట్లోనే తీయడం విశేషం. విలన్ మర్డర్స్ చేసే స్టైల్ సింపుల్ గా ఉన్నా కూడా అది స్క్రీన్ మీద చాలా పవర్ ఫుల్ గా పండింది. ఎలాంటి హడావుడి లేకుండానే హీరో హీరోయిన్లు ఇద్దరికీ గూస్ బంప్స్ తెప్పించే మాస్ ఎలివేషన్స్ ఇవ్వడం డైరెక్టర్ టాలెంట్ కు నిదర్శనం.

నటీనటులు:
కాప్ క్యారెక్టర్స్ చేయడం సూర్యకు కొట్టిన పిండి. ఇందులో ఆయన చాలా కూల్ అండ్ సెటిల్డ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చేలా ఆయన పాత బ్లాక్ బస్టర్స్ రిఫరెన్సులను చాలా నేచురల్ గా వాడుకున్నారు. ఇక ఈశ్వరన్ పాత్రలో నటించిన కుర్రాడు నస్లెన్ నటన సినిమాకే హైలైట్ అని చెప్పాలి. ఒక సైకో కిల్లర్ గా అతను పండించిన హావభావాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. మాయ పాత్రలో నజ్రియా నజీమ్ జీవించేసింది, పైగా ఆమెకు ఒక అదిరిపోయే మాస్ సీన్ కూడా దక్కడం విశేషం. హీరో తండ్రిగా సీనియర్ యాక్టర్ ఆనందరాజ్ తో పాటు మిగిలిన నటీనటులంతా తమ పాత్రలకు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యారు.
టెక్నికల్ టీం:
మ్యూజిక్ డైరెక్టర్ సుషిన్ శ్యామ్ కు తమిళ్ లో ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ అయినా, రెగ్యులర్ థ్రిల్లర్ సినిమాల్లా లౌడ్ మ్యూజిక్ ఇవ్వకుండా చాలా ప్రశాంతమైన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో మ్యాజిక్ చేశాడు. వినీత్ అగస్త్యన్ కెమెరా వర్క్ సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చింది. ఎడిటర్ అజ్మల్ సబు వర్క్ ఓకే అనిపిస్తుంది, ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ కట్ చేసి ఉంటే సినిమా ఇంకాస్త స్పీడ్ గా ఉండేది. పరిమితమైన లొకేషన్స్ లోనే ఇంత అద్భుతమైన అవుట్ పుట్ ఇచ్చిన టెక్నికల్ టీం వర్క్ ను మెచ్చుకోకుండా ఉండలేం. జీతూ మాధవన్ టేకింగ్ ఈ చిత్రాన్ని ఈ ఏడాది బెస్ట్ మూవీస్ లిస్టులో నిలబెట్టింది.
పంచ్ లైన్:
సీన్.. పక్కా పైసా వసూల్ ఇన్వెస్టిగేషన్ సీన్..!
