
బిగ్‌బాస్ హౌస్ నుంచి నిన్న సాయంత్రం రోహిత్ ఎలిమినేట్ అయినట్టుగా వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి ఎన్నో ఊహాగాలు వినవస్తున్నాయి. రోహిత్ ఎలిమినేట్ అవలేదని.. సీక్రెట్ రూమ్‌కి పంపారంటూ ముందుగా వార్తలు వచ్చాయి. ఆ తరువాత కాసేపటికే సీక్రెట్ రూం ఏదీ లేదు. రోహిత్ తన తల్లికి కాల్ చేశాడట. ఆమె నీ ఇష్ట ప్రకారం నిర్ణయం తీసుకోమని చెప్పారట. దీంతో తను సెల్ఫ్ ఎవిక్ట్ అయ్యేందుకే మొగ్గు చూపాడట అంటూ వార్తలొచ్చాయి. ఆ తరువాత మరికాసేపటికే రోహిత్‌ను సీక్రెట్ రూంకి పంపాలని హోస్ట్ నాగార్జున, బిగ్‌బాస్ టీం శతవిధాలుగా ప్రయత్నించిందని.. రోహిత్‌కు తన తల్లితోనూ.. అలాగే అభిజిత్‌తోనూ చెప్పించారని అయినా రోహిత్ వినలేదని వార్తలొచ్చాయి.
హౌస్‌లోనూ.. వీకెండ్‌లో హోస్ట్ నాగార్జున వచ్చి ఇన్ని వారాలుగా తననే టార్గెట్ చేయడంపై రోహిత్ చాలా అసంతృప్తితో ఉన్నాడని.. కేవలం సెల్ఫ్ రెస్పెక్ట్‌ను కాపాడుకునేందుకే అతను బయటకు వచ్చాడంటూ వార్తలొచ్చాయి. అంతేకాదు.. బిగ్‌బాస్ బజ్ జరుగుతోందని.. మరికాసేపట్లో రోహిత్ ఇంటర్వ్యూ పూర్తై బయటకు వస్తాడని సైతం వార్తలొచ్చాయి.
కనీసం రోహిత్‌ను ప్రోమో కూడా వేయకుండా బయటకు పంపించారని.. బిగ్‌బాస్ టీం, హోస్ట్ నాగార్జున కేవలం రోహిత్ ప్రశ్నించాడనే కారణంగానే ఇదంతా చేసిదంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.. రోహిత్ అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటకు వచ్చిన దాఖలాలు అయితే కనిపించలేదు. పోనీ అక్కడే ఉన్నాడా? అనేది కూడా క్లారిటీ లేదు.
ఇకపోతే తాజాగా మరో న్యూస్.. రోహిత్‌ను బయటకు పంపేందుకు నాగ్ ఓటింగ్ నిర్వహించగా.. అమన్ సైతం అతను బయటకు వెళ్లాలంటూ ఓటు చేశాడంటూ వార్తలొచ్చాయి. అసలు ఈ ఊహాగానాలన్నింటిలో ఏది నిజం? రోహిత్ ఏమయ్యాడు? వంటి విషయాలు తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.
