Aadarsha Kutumbam Review
నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సినిమాలకు కథ అందించిన త్రివిక్రమ్.. ఫస్ట్ టైమ్ వెంకటేష్ సినిమాను డైరెక్ట్ చేసారు. అలా వచ్చిందే ఆదర్శ కుటుంబం.. ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలున్నాయి. మరి వాటిని సినిమా అందుకు ఉందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:
ఆర్థిక కష్టాలతో సతమతమయ్యే ఓ సామాన్య ఇంటిపెద్ద చిట్టిబాబు (వెంకటేష్). భార్య స్వర్ణ (శ్రీనిథి శెట్టి), ఇద్దరు పిల్లలతో ప్రశాంతంగా బతికే ఈ చిన్న కుటుంబానికి అదృష్టం వరించి భారీ లాటరీ తగులుతుంది. అదే సమయంలో నగరంలో ధనవంతులను లక్ష్యంగా చేసుకుని, వారి ఇళ్లలో పనివాళ్లుగా చేరి దారుణ హత్యలు చేసే ఓ కిరాతక ముఠా సంచరిస్తుంటుంది. కోట్లు గెలుచుకున్న ఈ ఫ్యామిలీపై ఆ నేరస్తుల కన్ను పడుతుంది. పథకం ప్రకారం పనివాళ్లుగా ఆ ఇంట్లోకి ప్రవేశిస్తారు. మరోవైపు ఈ హంతకులను పట్టుకునేందుకు పోలీస్ ఆఫీసర్ దాము (నారా రోహిత్) తీవ్రంగా శ్రమిస్తుంటాడు. ఈ ప్రమాదకర ముఠా నుంచి తన భార్యాపిల్లలను ఆ తండ్రి ఎలా కాపాడుకున్నాడు? పోలీసులకు వీళ్ళు ఏ విధంగా సాయపడ్డారు? అన్నదే ఈ సినిమా అసలు సారాంశం.
స్క్రీన్ ప్లే:
దర్శకుడి రెగ్యులర్ మేకింగ్ స్టైల్‌కు ఇది పూర్తి భిన్నమైన ప్రయోగం అని చెప్పాలి. మొదట్లో సాధారణ మధ్యతరగతి కుటుంబం చుట్టూ తిరిగే వినోదాత్మక సన్నివేశాలతో సినిమా సరదాగా మొదలవుతుంది. ఈ క్రమంలో వచ్చే హాస్యభరితమైన మాటలు, కుటుంబ సభ్యుల మధ్య జరిగే చిన్న చిన్న సంఘటనలు ప్రేక్షకులను ఒక కంఫర్ట్ జోన్‌లోకి తీసుకెళ్తాయి. అయితే అప్పటివరకు ప్రశాంతంగా సాగుతున్న ఈ ఫ్యామిలీ డ్రామాలోకి నేరగాళ్లు ప్రవేశించడంతో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. సరిగ్గా ఇక్కడే వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ ఎవరూ ఊహించని విధంగా ఉండి, సీటు అంచున కూర్చోబెడుతుంది. రాబోయే ఆట ఎంత ప్రమాదకరంగా ఉండబోతోందో ఈ మలుపు ద్వారా డైరెక్టర్ స్పష్టంగా చూపించాడు.

ఇక రెండవ భాగం పూర్తిగా మైండ్ గేమ్‌లా మారుతుంది. ప్రాణాపాయంలో ఉన్న తన వారిని రక్షించుకునేందుకు ఇంటి పెద్ద చేసే పోరాటం, వేసే ఎత్తుగడలు సినిమాటిక్‌గా కాకుండా చాలా సహజంగా అనిపిస్తాయి. కాస్త నెమ్మదిగా సాగుతున్నట్లు అనిపించినా, అడుగడుగునా ఉత్కంఠను రేకెత్తించే ఎపిసోడ్స్‌తో దర్శకుడు ఆ లోటును భర్తీ చేశాడు. ఓవైపు కిరాతకులైన హంతకులు, మరోవైపు వారి బారి నుంచి తప్పించుకునేందుకు దారితెలియని ఒక కుటుంబం.. ఈ రెండింటి మధ్య సాగే డ్రామా గత సస్పెన్స్ సినిమాలను గుర్తుకు తెస్తుంది. ముఖ్యంగా పతాక సన్నివేశాలకు ముందు వచ్చే పోరాట ఘట్టాలు, దానికి ముడిపడి ఉన్న కుటుంబ భావోద్వేగాలు అద్భుతంగా పండాయి. కేవలం క్రైమ్ మాత్రమే కాకుండా, బలమైన ఎమోషన్‌ను కూడా జోడించడంతో ఈ చిత్రం ఓ పరిపూర్ణమైన థ్రిల్లర్‌గా రూపుదిద్దుకుంది.
నటీనటులు:
విక్టరీ హీరో తన నటవిశ్వరూపం చూపించాడు. బాధ్యతాయుతమైన తండ్రిగా, కుటుంబాన్ని రక్షించుకునే పోరాటయోధుడిగా ఆయన నటన అద్భుతం. శ్రీనిధి పాత్రలోని వైవిధ్యం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. పోలీస్ ఆఫీసర్‌గా నారా రోహిత్ తన గంభీరమైన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నాడు. కమెడియన్ సత్య తనదైన టైమింగ్‌తో నవ్వులు పూయించి టెన్షన్ వాతావరణంలో కాస్త రిలీఫ్ ఇచ్చాడు. మిగిలిన పాత్రధారులు, ముఖ్యంగా బాలనటులు తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.

టెక్నికల్ టీం:
సాంకేతికంగా ఈ సినిమా ఉన్నత ప్రమాణాలతో రూపుదిద్దుకుంది. థమన్ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాల్లోని ఉత్కంఠను అమాంతం పెంచేసింది. కెమెరామెన్ రవి కే చంద్రన్ పనితనం ప్రతి ఫ్రేమ్‌ను చాలా రిచ్‌గా చూపించింది. నిర్మాణ సంస్థ ఖర్చు విషయంలో ఎక్కడా వెనకాడలేదని స్పష్టంగా తెలుస్తుంది. నవీన్ నూలి ఎడిటింగ్ ఇంకాస్త బలంగా ఉండాల్సింది. దర్శకుడి మార్కు పదునైన సంభాషణలు, అద్భుతమైన యాక్షన్ కొరియోగ్రఫీ ఈ చిత్రానికి ప్రధాన బలాలుగా నిలిచాయి.
చివరగా:
ఆదర్శ కుటుంబం.. కొన్ని లోపాలున్నాయి.. కానీ పక్కా కమర్షియల్ ఫ్యామిలీ..!
