
టాలీవుడ్‌లో మాటల మాంత్రికుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన డైరెక్ట్ చేసే సినిమాల్లో డైలాగ్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, కడుపుబ్బా నవ్వించే వినోదం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. అయితే ఆయన చుట్టూ ఎప్పుడూ ఒక నెగిటివ్ ప్రచారం కూడా నడుస్తూనే ఉంటుంది. అదేంటంటే ఆయన ఇతర భాషల చిత్రాల నుంచి కథలను, సన్నివేశాలను కాపీ కొడతారనే ఆరోపణలు తరచుగా వినిపిస్తుంటాయి. ఇప్పుడు ఆయన తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ఆదర్శ కుటుంబం విషయంలో కూడా ఇదే టాక్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ కొత్త సినిమా ఏకంగా రెండు హాలీవుడ్ మూవీస్ కు మిక్స్డ్ వర్షన్ అని నెటిజన్లు తెగ కామెంట్స్ చేస్తున్నారు. మన దర్శకుడు ఈసారి కూడా తన పాత స్టైల్ లోనే ఇంటర్నేషనల్ సినిమాలను దించేశాడనే చర్చ ఇప్పుడు హాట్ హాట్‌గా నడుస్తుంది.
సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చల ప్రకారం చూసుకుంటే ఆదర్శ కుటుంబం సినిమా స్టోరీ లైన్ కు రెండు ఇంగ్లీష్ సినిమాలతో దగ్గరి పోలికలు ఉన్నాయని తెలుస్తోంది. అందులో మొదటిది 2021లో సంవత్సరంలో వచ్చి సూపర్ హిట్ అయిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ Nobody. బాబ్ ఒడెన్ కిర్క్ హీరోగా నటించిన ఆ సినిమాలో ఒక సాధారణ కుటుంబ యజమాని లోపల ఒక పెద్ద యాక్షన్ హీరో దాగి ఉంటాడు. అచ్చం అలాంటి పాయింట్ తోనే మన డైరెక్టర్ ఈ సినిమాను అల్లాడని సినిమా రివ్యూలు కూడా స్పష్టం చేస్తున్నాయి. ఇక దీనికి తోడు 2012లో వచ్చిన ది ఫ్యామిలీ అనే మరో హాలీవుడ్ సినిమా ఛాయలు కూడా ఇందులో పుష్కలంగా ఉన్నాయని చర్చలు జరుగుతున్నాయి. ఈ రెండు ఇంగ్లీష్ సినిమాల కోర్ పాయింట్స్ తీసుకుని, దానికి మన తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఫ్యామిలీ సెంటిమెంట్ దట్టించి దర్శకుడు ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాడని ఆడియన్స్ ఆధారాలతో సహా నెట్టింట పోస్టులు పెడుతున్నారు.
నిజానికి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఇలాంటి కాపీ ఆరోపణలు రావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో పవర్ స్టార్ తో ఆయన చేసిన అజ్ఞాతవాసి సినిమా టైమ్ లో అయితే ఏకంగా ఇండస్ట్రీలో పెద్ద వివాదమే చెలరేగింది. ఆ సినిమా లార్గో వించ్ అనే ఒక ఫ్రెంచ్ సినిమాకు అఫీషియల్ కాపీ అని అందరికీ తెలిసిందే. ఆ టైమ్ లో ఒరిజినల్ సినిమా డైరెక్టర్ కూడా ఈ విషయంపై ట్విట్టర్ లో స్పందించడం పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఆ తర్వాత వచ్చిన అరవింద సమేత వీర రాఘవ సినిమాలో కూడా ఒక కీలకమైన ఎపిసోడ్ ను లూక్ బెస్సన్ డైరెక్ట్ చేసిన ది ఫ్యామిలీ సినిమా నుంచి యాజ్ ఇట్ ఈజ్ గా దించేశారనే విమర్శలు వచ్చాయి. కథ మొత్తం కాకపోయినా, కనీసం ఆకట్టుకునే యాక్షన్ బ్లాక్స్ లేదా కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ ను అయినా సరే విదేశీ సినిమాల నుంచి ఇన్స్పైర్ అవ్వడం ఆయనకు ఒక అలవాటుగా మారిపోయిందని యాంటీ ఫ్యాన్స్ తరచుగా ట్రోల్ చేస్తుంటారు.

కేవలం ఈ మధ్య వచ్చిన సినిమాలకే కాదు, ఆయన కెరీర్ లో క్లాసిక్ గా మిగిలిపోయిన పాత బ్లాక్ బస్టర్ సినిమాలపై కూడా జనాలు కాపీ ముద్ర వేస్తున్నారు. రెండు దశాబ్దాల క్రితం వచ్చి టెలివిజన్ లో ఎన్నో రికార్డులు క్రియేట్ చేసిన అతడు సినిమాలోని కొన్ని సీన్స్ కు కూడా హాలీవుడ్ మూలాలు ఉన్నాయని ఈ మధ్యే ఇంటర్నెట్ లో ఒక రేంజ్ లో ట్రోలింగ్ జరిగింది. ముఖ్యంగా ఆ సినిమాలో హీరో ట్రైన్ లో నుంచి ఎస్కేప్ అయ్యే యాక్షన్ సీక్వెన్స్ మొత్తం యుఎస్ మార్షల్స్ అనే ఇంగ్లీష్ సినిమా నుంచి కాపీ కొట్టిందే అని సినీ అభిమానులు ఆ రెండు వీడియోలను పక్కపక్కన పెట్టి మరీ వైరల్ చేశారు. అప్పట్లో జనాలకు గ్లోబల్ సినిమాపై పెద్దగా అవగాహన లేదు కాబట్టి ఎవరికీ ఈ విషయాలు అంత త్వరగా తెలిసేవి కావు. కానీ ఇప్పుడు అందరి చేతుల్లో స్మార్ట్ ఫోన్, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఓటిటి ప్లాట్ ఫామ్స్ అందుబాటులో ఉండటంతో ఏ డైరెక్టర్ ఎక్కడ ఏ చిన్న సీన్ తీసుకున్నా సరే ఫ్యాన్స్ ఇట్టే పసిగట్టేస్తున్నారు.
ప్రపంచ సినిమాలో వచ్చిన ఒక అద్భుతమైన ఐడియాను స్ఫూర్తిగా తీసుకోవడం తప్పు కాదు కానీ, ఒక స్టార్ రైటర్ గా పేరున్న వ్యక్తి ప్రతిసారి ఇలా కాపీ ఆరోపణలు ఎదుర్కోవడం ఆయన ఒరిజినాలిటీని ప్రశ్నించేలా చేస్తోంది. డైలాగ్స్ రాయడంలో, ఫ్యామిలీ డ్రామాను పండించడంలో ఆయనకు ఆయనే సాటి అని అందరూ ఒప్పుకుంటారు. కానీ కొత్త కథలు రాసుకోవడంలో మాత్రం ఆయన విదేశీ సినిమాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారా అనే డౌట్ సగటు ప్రేక్షకుడికి కలుగుతోంది. హాలీవుడ్ సినిమాలను కేవలం ఇన్స్పిరేషన్ గా తీసుకుని తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఆయన మార్పులు చేస్తున్నారా లేక సొంతంగా ఆలోచించడం మానేసి ఈజీగా వేరే కథలను వాడుకుంటున్నారా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద ప్రశ్నార్థకంగా మారింది. ఏదేమైనా ఆయన లాంటి ఒక టాలెంటెడ్ డైరెక్టర్ నుంచి ఆడియన్స్ అదిరిపోయే డైలాగ్స్ తో పాటు 100 శాతం ఒరిజినల్ కథను కూడా ఆశిస్తారు. మరి భవిష్యత్తులో తీయబోయే సినిమాలతో అయినా ఆయన ఈ కాపీ విమర్శలకు చెక్ పెడతారేమో చూడాలి.
