Menu
BREAKING
కామ్రేడ్ కళ్యాణ్ ట్రైలర్ రివ్యూ.. వాళ్ల మనోభావాలు దెబ్బతింటే అంతే సంగతులు..!   |   Biggboss10 Telugu: రెచ్చిపోతున్న సుధీర్.. పడిపోతున్న గ్రాఫ్..   |   ఇదెక్కడి దిక్కుమాలిన ప్లానింగ్.. కనీసం ట్రైలర్స్ కట్ చేయడానికి టైమ్ దొరకట్లేదా..?   |   Biggboss10 Telugu: హాట్ హాట్‌గా నామినేషన్స్.. ఈవారం కూడా కామనర్స్ బలి..   |   లెజెండరీ నటి శారద పరిస్థితి చూస్తున్నారా.. 81 ఏళ్ళ వయసులో కూడా..!   |   Biggboss10 Telugu: నామినేషన్స్‌లో రెచ్చిపోయిన వర్షిణి, ముఖేష్..   |   Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ED సోదాలు.. అసలు నిజమేంటో తెలుసా..?   |   AK47: ఆదర్శ కుటుంబం మళ్లీ వాయిదా.. అసలు కారణం అదన్నమాట..!   |   Biggboss10 Telugu: రోహిత్ పని ఓవర్ అని సెలబ్రిటీలు అనుకుంటున్నారా?   |   Biggboss10 Telugu: నెరవేరిన సెలబ్రిటీల కోరిక.. బిగ్‌బాస్ నుంచి కామనర్ సృష్టి అవుట్   |   Anil Ravipudi: అనిల్ రావిపూడి యామినేషన్ సినిమా వెనక అంత పెద్ద కథ ఉందా..?   |   ఫ్లాప్ వాళ్లను ఆపలేదు.. రూట్ మార్చేలా చేసింది.. కుర్రాళ్ళూ జాగ్రత్త..!   |   లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఇక లేరు.. ది ట్రెండ్ సెట్టర్..!   |   Biggboss10 Telugu: రోహిత్‌కే ఫుల్ డోసు.. మిగిలిన వాళ్లంతా లైట్..   |   Biggboss10 Telugu: కామనర్స్‌కు పెద్ద దెబ్బ.. అంతా ముఖేషే చేశాడు..
Thella Kaagitham
MOVIE REVIEW

Thella Kaagitham

★ 2.25 / 5
Release Date: October 2, 2026
Cast
Harsh Roshan, Nakshatra, Ajay, Saranya Pradeep, Raj Kumar Kasireddy
Director
Ramesh Bandreddi
Music Director
Vijay Bulganin
Producer
Krishna Kommalapati

Thella Kaagitham Review

గతంలో కోర్ట్, బ్యాండ్ మేళం లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న కుర్ర హీరో హర్ష్ రోషన్ నటించిన తాజా చిత్రం తెల్ల కాగితం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వరుసగా తన వయసుకు సరిపోయే ప్రేమకథలనే ఎంచుకుంటూ వస్తున్న అతడు.. ఈసారి చేసిన టీనేజ్ లవ్ స్టోరీ ఎలా ఉంది, ఇందులో దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు అనేది ఇప్పుడు చూద్దాం.

Thella Kaagitham Review

కథ:

ఈ సినిమా నేపథ్యం భీమవరం పరిసర ప్రాంతాల్లో సాగుతుంది. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన రాము (హర్ష్ రోషన్)ను అతడి అన్నయ్య, వదిన అల్లారుముద్దుగా పెంచుతారు. అదే ప్రాంతంలో మెడికల్ షాప్ రన్ చేసే మూర్తి (అజయ్) అనే వ్యక్తికి ఊళ్లో మంచి పేరుంటుంది. అతడి కూతురు ఆశ (నక్షత్ర), రాము ఇద్దరూ ఒకే స్కూల్‌లో పదో తరగతి చదువుతుంటారు. ఆ వయసులో వచ్చే ఆకర్షణతో ఇద్దరూ ప్రేమలో పడతారు. సరిగ్గా అదే సమయంలో రాముకు వాళ్ల మావయ్య కొన్ని చెడు సలహాలు ఇస్తాడు. శారీరకంగా దగ్గరైతేనే ప్రేమ బలంగా ఉంటుందని, ఎప్పటికీ విడిపోరని అతడు చెప్పిన మాటలు విన్న రాము.. ఆశతో చనువుగా ఉండటానికి ప్రయత్నిస్తాడు. మొదట ఆశ అంగీకరించకపోయినా, ఎక్కడ తన ప్రేమికుడు దూరమవుతాడో అన్న భయంతో అతడి కోరికకు తలొగ్గుతుంది. ఊహ తెలియని వయసులో ఈ జంట వేసిన ఆ ఒక్క తప్పటడుగు వారి భవిష్యత్తును ఎలా ప్రమాదంలో పడేసింది, ఆ తర్వాత వారు ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి అనేదే ఈ చిత్ర ఇతివృత్తం.

Thella Kaagitham Review

స్క్రీన్ ప్లే:

తెలుగు ప్రేక్షకులకు ఇలాంటి యవ్వన దశలో సాగే ప్రేమకథలు కొత్తేమీ కాదు. చాలా ఏళ్ల క్రితం వచ్చిన చిత్రం సినిమా మొదలుకుని ఎన్నో సినిమాలు ఈ పాయింట్ మీద వచ్చాయి. వయసు తెచ్చే ఆకర్షణలో పడిపోయి ఆ తర్వాత వాటిని ఎలా ఎదుర్కోవాలో తెలియక సతమతమయ్యే యువతను ఉద్దేశించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ముఖ్యంగా 15 నుంచి 18 ఏళ్ల మధ్యలో పిల్లల ఆలోచనలు ఎలా ఉంటాయి, క్లారిటీ కంటే కన్ఫ్యూజన్ ఎలా ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని రాము, ఆశ క్యారెక్టర్ల ద్వారా చూపించే ప్రయత్నం చేశారు. ప్రారంభ సన్నివేశాలు పర్వాలేదనిపించినా, కథ ముందుకు వెళ్తున్న కొద్దీ కొన్ని సీన్స్ మరీ సాగదీసినట్లు అనిపిస్తాయి. ముఖ్యంగా పది చదివే కుర్రాడికి కండోమ్ గురించి ఏమాత్రం అవగాహన లేకపోవడం, దానితో బెలూన్‌లా ఆడుకోవడం లాంటివి తెరమీద కాస్త ఇబ్బందికరంగానే ఉంటాయి. ఆ వయసులో ఉండే అమాయకత్వాన్ని చూపించే క్రమంలో దర్శకుడు రాసుకున్న కొన్ని ట్రాక్స్ పెద్దగా వర్కవుట్ కాలేదు. ఎందుకంటే కండోమ్ సీన్ గురించే తీసుకుంటే.. బెలూన్స్ అనుకుని తీసుకునేటప్పుడు అక్కడ బోర్డు మీద తాటికాయంత అక్షరాలతో రాసుంటుంది కదా.. అప్పుడైనా చూడడా అనే సందేహం అందరిలోనూ వస్తుంది. అలాంటి మెచ్యూరిటీ లేని సీన్స్ చాలానే ఉన్నాయిందులో. అయితే విరామం సమయానికి వచ్చే ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎపిసోడ్ సినిమాపై ఆసక్తిని పెంచుతుంది. ఆ తర్వాత ద్వితీయార్థం మళ్లీ నెమ్మదిగా సాగుతుంది. కానీ క్లైమాక్స్‌కు ముందు వచ్చే 20 నిమిషాలు మాత్రం సినిమాకు ప్రాణం పోశాయి. దర్శకుడు ముగింపును చాలా ఎమోషనల్‌గా, గుండెను హత్తుకునేలా తీర్చిదిద్దాడు. క్షణికావేశంలో చేసే చిన్న తప్పు జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందనే మెసేజ్‌ను చివర్లో చాలా బలంగా జనాల్లోకి తీసుకెళ్లగలిగాడు. కానీ దానికి ముందు మొత్తం స్లో నెరేషన్ బాగా ఇబ్బంది పెడుతుంది. ఓ విధంగా సహనానికి పరీక్ష పెడుతుందనే చెప్పాలి.

Thella Kaagitham Review

నటీనటులు:

హీరోగా హర్ష్ రోషన్ తన పాత్రకు పూర్తిగా న్యాయం చేశాడు. స్కూల్ కుర్రాడిగా అల్లరి చేస్తూనే, అమాయకత్వం ప్రదర్శించే సన్నివేశాలతో పాటు పతాక సన్నివేశాల్లో కంటతడి పెట్టించాడు. ఆశ పాత్రలో నక్షత్ర తన లుక్స్‌తో, నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమాలో అందరికంటే ఎక్కువగా చెప్పుకోవాల్సింది హీరోయిన్ తండ్రి పాత్ర చేసిన అజయ్ గురించి. ఆయన నటన సినిమాకు చాలా ప్లస్ అయింది. హీరోకి వదినగా నటించిన శరణ్య ప్రదీప్ తన అనుభవాన్ని తెరపై చూపించింది. హీరో స్నేహితుడిగా చేసిన కుర్రాడు సహా మిగతా ఆర్టిస్టులంతా తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.

టెక్నికల్ టీం:

సంగీత దర్శకుడు విజయ్ బుల్గానిన్ ఇచ్చిన పాటలు వినసొంపుగా ఉన్నాయి, ఇప్పటికే చిలక పాట శ్రోతలను ఆకట్టుకుంది. అలాగే నేపథ్య సంగీతం కూడా చాలా చోట్ల సీన్స్‌ను ఎలివేట్ చేసింది. కెమెరామెన్ గుహన్ ఛాయాగ్రహణం సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చింది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి. ఎడిటింగ్ విభాగం మీద ఇంకాస్త దృష్టి పెట్టాల్సింది, రిపీట్ అవుతున్నట్లు అనిపించే కొన్ని సీన్స్‌ను కట్ చేసుంటే బాగుండేది. దర్శకుడు రమేష్ ఎంచుకున్న పాయింట్ బాగున్నా, దాన్ని తెరపై చూపించిన విధానాన్ని ఇంకాస్త బెటర్‌గా ప్లాన్ చేసుకుని ఉంటే రిజల్ట్ మరోలా ఉండేది.

చివరగా:

కొన్ని లోపాలు, నెమ్మదిగా సాగే సన్నివేశాలు ఉన్నప్పటికీ.. యువతకు ఒక మంచి సందేశాన్నిచ్చే ప్రయత్నం చేసిన డీసెంట్ మూవీ తెల్ల కాగితం..

Thella Kaagitham Cast

Harsh Roshan Nakshatra Ajay Saranya Pradeep Raj Kumar Kasireddy