
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న భారీ పీరియాడిక్ సినిమా సంబరాల ఏటిగట్టు వ్యవహారం ఇండస్ట్రీలో పెద్ద హాట్ టాపిక్ గా మారిందిప్పుడు. విరూపాక్ష లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తేజు కెరీర్ అమాంతం స్పీడ్ అందుకుంటుందని అందరూ భావించారు. ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఏకంగా 120 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి తేజు మార్కెట్ స్టామినా ఏంటో నిరూపించింది. ఆ బ్లాక్ బస్టర్ తర్వాత సాయి ధరమ్ తేజ్ కు ఇండస్ట్రీ నుంచి ఎన్నో క్రేజీ ఆఫర్స్ క్యూ కట్టాయి. కానీ ఆయన మాత్రం తనను నమ్మిన నిర్మాతలకు ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం సంబరాల ఏటిగట్టు ప్రాజెక్ట్ తోనే ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ కమిట్మెంట్ ఇప్పుడు ఆయన కెరీర్ కే పెద్ద స్పీడ్ బ్రేకర్ లా మారింది. సినిమా మొదలై ఇన్నాళ్లు అవుతున్నా ఇంకా ఒక కొలిక్కి రాకపోవడం ఫ్యాన్స్ కు తీవ్ర నిరాశను మిగులుస్తోంది.
ఈ సినిమా ఆలస్యం వెనుక ప్రధానంగా వినిపిస్తున్న పేరు నిర్మాతలదే. హనుమాన్ లాంటి సెన్సేషనల్ పాన్ ఇండియా హిట్ తో మంచి ప్యాషన్ ఉన్న నిర్మాతలుగా పేరు తెచ్చుకున్న నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ఈ సినిమా ప్రొడక్షన్ ప్లానింగ్ లో దారుణంగా విఫలమవుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డెబ్యూ డైరెక్టర్ రోహిత్ చెప్పిన కథ చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ, దాన్ని స్క్రీన్ మీదకు తీసుకురావడంలో ప్రొడక్షన్ హౌస్ తరపున జరగాల్సిన వర్క్ సరిగ్గా జరగడం లేదని తెలుస్తుంది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న ఇన్ సైడ్ టాక్ ప్రకారం, చేతిలో డబ్బులు ఉన్నప్పుడు మాత్రమే ఈ సినిమా షూటింగ్ చేస్తున్నారని, ఫండ్స్ లేనప్పుడు గ్యాప్ ఇస్తూ వస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. అంత పెద్ద హిట్ ఇచ్చిన తర్వాత ఒక అగ్ర హీరో డేట్స్ చేతిలో ఉన్నప్పుడు దాన్ని ఎంత పర్ఫెక్ట్ గా వాడుకోవాలో మేకర్స్ కు తెలియకపోవడం వల్లే ప్రొడక్షన్ పరంగా ఈ ప్రాజెక్ట్ ఇంత దారుణంగా దెబ్బతింటోందనే విమర్శలు వస్తున్నాయి.
ఈ ప్రాజెక్ట్ కారణంగా సాయి ధరమ్ తేజ్ తన కెరీర్ లో అత్యంత విలువైన మూడేళ్ల సమయాన్ని ఇచ్చేసారు. సంబరాల ఏటిగట్టు సినిమా కోసం తేజు తన ప్రాణం పెట్టి పని చేస్తున్నారు. కేవలం సిక్స్ ప్యాక్ చేయడం మాత్రమే కాకుండా, పాత్ర డిమాండ్ మేరకు ఫిజికల్ గా ఎంతో కఠినమైన వర్కవుట్స్ చేస్తూ తన మేకోవర్ ను పూర్తిగా మార్చుకున్నారు. ఇంత కష్టపడుతున్నా కూడా షూటింగ్ నత్తనడకన సాగుతుండటంతో ఆయన డేట్స్ అన్నీ వేస్ట్ అయిపోతున్నాయి. అయినా కూడా తాను ఇచ్చిన మాట కోసం, నిర్మాతలకు ఇచ్చిన కమిట్మెంట్ కోసం సాయి ధరమ్ తేజ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. హీరో వైపు నుంచి 100 శాతం కోపరేషన్ ఉన్నప్పటికీ, మేకర్స్ దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడం నిజంగా దురదృష్టకరమే.

వాస్తవానికి విరూపాక్ష లాంటి 100 కోట్ల సినిమా తర్వాత ఏ హీరో అయినా తన మార్కెట్ ను మరింత పెంచుకోవడానికి వరుసగా ప్రాజెక్టులు లైన్ లో పెడతారు. ఈ మూడేళ్ల గ్యాప్ లో సాయి ధరమ్ తేజ్ కనీసం మరో రెండు లేదా మూడు సినిమాలు చేసి ఉంటే ఆయన రేంజ్, బాక్సాఫీస్ మార్కెట్ ఇప్పుడు మరో లెవెల్ లో ఉండేవి. టాలీవుడ్ టైర్ 2 హీరోల లిస్ట్ లో టాప్ ప్లేస్ కు చేరుకునే అవకాశం ఆయనకు ఉండేది. కానీ ఆ అద్భుతమైన అవకాశాలను, ఎంతో మంది బడా డైరెక్టర్ల ఆఫర్లను వదిలేసి కేవలం హనుమాన్ ప్రొడ్యూసర్లకు ఇచ్చిన మాట కోసమే ఆయన కట్టుబడి ఉన్నారు. హీరో అంత లాయల్ గా ఉన్నప్పుడు ప్రొడక్షన్ సైడ్ నుంచి కూడా అంతే స్పీడ్ ఉండాలి, కానీ వాళ్లు హీరో టైమ్ ను వాల్యూ చేయకపోవడమే ఇప్పుడు ప్రధానమైన విమర్శలకు దారి తీస్తోంది. మార్కెట్ పరంగా తేజుకు జరిగిన ఈ డ్యామేజ్ ను మేకర్స్ ఎలా భర్తీ చేస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
ఇక ఈ సినిమా రిలీజ్ డేట్స్ విషయంలో జరుగుతున్న డ్రామా అంతా ఇంతా కాదు. ముందుగా మేకర్స్ ప్లానింగ్ ప్రకారం ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 25, 2025న భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని భావించారు. కానీ షూటింగ్ డిలే కావడంతో ఆ డేట్ కాస్తా అటకెక్కింది. కనీసం సంక్రాంతి కానుకగా జనవరి 13, 2027 నాటికైనా థియేటర్లలోకి వస్తుందా అంటే అది కూడా కష్టమే అనే వార్తలు వస్తున్నాయి. క్వాలిటీ విషయంలో రాజీ పడకూడదని, సినిమాలో భారీగా ఉన్న విఎఫ్ఎక్స్ వర్క్స్ కోసమే ఇంత టైమ్ తీసుకుంటున్నామని దర్శక నిర్మాతలు కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. పరిస్థితులు చూస్తుంటే ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా 2027 సమ్మర్ లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేలా కనిపిస్తోంది. సరైన ప్లానింగ్ లేకుండా కేవలం విఎఫ్ఎక్స్ అని సాకు చెబుతూ ఉంటే రిలీజ్ నాటికి సినిమాపై ఆడియన్స్ కు ఉన్న ఆసక్తి పూర్తిగా తగ్గిపోయే ప్రమాదం ఉంది. మేకర్స్ ఇప్పటికైనా మేల్కొని పక్కా షెడ్యూల్ తో సినిమాను కంప్లీట్ చేయాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.
