Jailer 2 Review

జైలర్ సినిమాతో నెల్సన్ చిన్న సైజ్ సంచలనమే సృష్టించాడు.. ఇండియన్ సినిమాను మూడేళ్ళ కింద షేక్ చేసారు ఈ సినిమాతో. రజినీకాంత్ కూడా 70 ఏళ్ళు దాటిన తర్వాత తన ఇమేజ్‌తో బాక్సాఫీస్‌ను ఫుట్ బాల్ ఆడేసాడు. ఆ కాంబినేషన్ మూడేళ్ళ తర్వాత మళ్లీ వచ్చిందిప్పుడు. మరి ఈసారి కూడా సేమ్ మ్యాజిక్ రిపీట్ అయిందా..? ఫస్ట్ పార్ట్ చేసిన మ్యాజిక్ సెకండ్ పార్ట్‌లోనూ వర్కవుట్ అయిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ:
తప్పుడు దారిలో నడిచిన కన్నకొడుకును అంతమొందించిన తర్వాత, ముత్తువేల్ పాండియన్ (రజినీకాంత్) గొడవలకు దూరంగా ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ నడుపుకుంటూ ప్రశాంతమైన జీవితం గడుపుతుంటాడు. మరోపక్క, తొలి భాగంలో హతమైన స్మగ్లర్ వర్మ (వినాయకన్) వెనుక ఉన్న పెద్ద నేర సామ్రాజ్య ముఠాలు, అతడిని చంపింది ఎవరో కనుక్కోవడానికి వేట మొదలుపెడతాయి. తన బతుకు తాను బతుకుతున్న ముత్తువేల్ జీవితంలోకి దిలీప్ (సూరజ్ వెంజరమూడు) అడుగుపెట్టడంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. అతడి రాకతో ముత్తువేల్ మళ్లీ అనుకోకుండా ఈ మాఫియా ముఠాల పోరాటంలోకి దిగాల్సి వస్తుంది. ఈ క్రమంలోనే గోవాలో అక్రమ కార్యకలాపాలు నడిపే కల్పక్ వంశానికి చెందిన తోబుట్టువులు బోధి కల్పక్ (ఎస్.జె. సూర్య), కాంతా కల్పక్ (విద్యాబాలన్) రంగంలోకి దిగి ముత్తువేల్పై పగబడతారు. ఇంతటి ప్రమాదకరమైన క్రైమ్ వరల్డ్ నుంచి తన ఫ్యామిలీని ముత్తువేల్ ఎలా రక్షించుకున్నాడు? వాళ్ళను చిత్తు చేయడానికి ఆయన వేసిన ఎత్తుగడలు ఏమిటి? అన్నదే ఈ చిత్ర కథ…

స్క్రీన్ ప్లే:
ఫస్ట్ పార్ట్‌తోనే ప్రేక్షకుల నాడిని సరిగ్గా పట్టుకున్న దర్శకుడు నెల్సన్, ఈ రెండో భాగంలోనూ తనకు బాగా పట్టున్న శైలిలోనే కథనాన్ని నడిపించాడు. ప్రధాన పాత్ర స్వభావం, ఆయన బలం ఏమిటో ప్రేక్షకులకు ముందే పూర్తి అవగాహన ఉంది కాబట్టి, దర్శకుడు ఎక్కడా లాజిక్ కోసం వెతకకుండా పూర్తిగా హీరోయిజం నిండిన సన్నివేశాలతో సినిమాను వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. ముఖ్యంగా ప్రథమార్ధం నడిచిన తీరు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. తనదైన శైలిలో సీరియస్ సన్నివేశాల్లోనూ సున్నితమైన హాస్యాన్ని పండిస్తూనే, కాసేపటికి ఒకసారి గూస్ బంప్స్ తెప్పించేలా మాస్ సీక్వెన్సులు రాసుకుని థియేటర్లలో విజిల్స్ వేయించాడు. ఇంటర్వెల్ కు ముందు వచ్చే సన్నివేశం కూడా ప్రేక్షకుల్లో మంచి ఉత్కంఠను రేకెత్తించేలా కుదిరింది. ఇక క్యామియోల విషయానికి వస్తే, మొదటి భాగంలోనే ఆ తరహా మెరుపులు చూశాం కాబట్టి ఈసారి ఆ ఆశ్చర్యం కొంత తగ్గిన మాట వాస్తవమే. అయినప్పటికీ, ఆ స్టార్స్ తెరపై కనిపించిన ప్రతిసారీ అభిమానుల్లో ఉత్సాహం ఉరకలెత్తడం ఖాయం.
సెకండాఫ్‌లో ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ఎక్కువ చోటు ఇవ్వడంతో, ఆరంభంలో ఓ 20 నిమిషాల పాటు కథనం కాస్త నెమ్మదిగా సాగిన భావన కలుగుతుంది. అయితే ఆ వెంటనే ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్రవేశపెట్టి సినిమా వేగాన్ని మళ్లీ గాడిన పెట్టాడు దర్శకుడు. కాకపోతే ఇందులో మూల కథ చాలా చిన్నదిగా ఉండటం, పైగా ప్రయాణం మొత్తం ఫస్ట్ పార్ట్ తరహాలోనే నడవడంతో కొత్త విలన్స్ తెరపైకి వచ్చినా పెద్దగా వైవిధ్యం కనిపించదు. దీనికి తోడు ఎస్.జె. సూర్య పాత్ర చుట్టూ అల్లిన సన్నివేశాలు కూడా కాస్త సాగదీసినట్లు అనిపిస్తాయి. సుమారు 3 గంటల నిడివి ఉండటం వల్ల సెకండ్ పార్ట్‌లో ల్యాగ్ పెరిగి, కథనం కొంత మందగించినట్లు తోస్తుంది. ఇక క్లైమాక్స్‌లో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ తళుక్కున మెరిసే సన్నివేశం ఆకట్టుకున్నప్పటికీ, ఆ పాత్ర ప్రవేశాన్ని మరింత బలంగా రాసుకుని ఉంటే ప్రభావం ఇంకా గొప్పగా ఉండేది. చివరగా మూడో భాగం కూడా రాబోతోందనే సంకేతాన్ని ఇస్తూ చిత్రాన్ని ముగించిన విధానం బాగుంది.

నటీనటులు:
రజినీకాంత్ ఎప్పటిలాగే తన స్టైల్ అండ్ స్వాగ్తో సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోశారు. ఆయన శరీరాన్ని కష్టపెడుతూ పెద్దగా విన్యాసాలు చేయకపోయినా, తనదైన శైలిలో నడుచుకుంటూ వచ్చి కళ్లద్దాలు పెట్టుకునే చిన్నపాటి మేనరిజంతోనే తెరపై అద్భుతమైన మెరుపులు మెరిపించారు. ప్రథమార్ధంలో డాన్ మూర్తి అనే పాత్రలో నమో నారాయణ పండించిన వినోదం ఈ చిత్రానికి అతిపెద్ద ఆకర్షణగా నిలిచింది. పరిస్థితి మొత్తం తన చేజారిపోతున్నా సరే, అంతా తన కనుసన్నల్లోనే జరుగుతోందని డాంబికాలు పలికే ఆ పాత్ర, రజినీకాంత్‌తో కలిసి కనిపించే సన్నివేశాల్లో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. కానీ ఇంటర్వెల్ తర్వాత ఈ పాత్ర నిడివి తగ్గిపోవడం సినిమా వేగంపై కొంత ప్రభావం చూపింది. యోగిబాబు తన పాత్ర పరిధిలో బాగానే వినోదాన్ని పంచాడు. ప్రధాన ప్రతినాయకుడిగా ఎస్.జె. సూర్య తనదైన శైలిలో బాగానే నటించినప్పటికీ, ఆ పాత్ర రూపకల్పనలో కొత్తదనం లోపించింది. అయితే ఆయన అక్కగా విలన్ పాత్రలో కనిపించిన విద్యాబాలన్ అభినయం చాలా కొత్తగా, ఆకట్టుకునేలా ఉంది. మరో ప్రతినాయకుడిగా సూరజ్ వెంజరమూడు కూడా తన పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు. ప్రత్యేక పాత్రల్లో మెరిసిన మోహన్‌లాల్ కేవలం రెండు సన్నివేశాలకే పరిమితమవ్వగా, శివరాజ్ కుమార్ దాదాపు 10 నిమిషాల పాటు తెరపై కనిపిస్తారు. జాకీ ష్రాఫ్, మిథున్ చక్రవర్తి పాత్రలకు మాత్రం ఈసారి నటించడానికి పెద్దగా అవకాశం లభించలేదు.
టెక్నికల్ టీం:
ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్. రజినీకాంత్ సైలెంట్‌గా నడిచొచ్చే నార్మల్ సన్నివేశాలను సైతం తన నేపథ్య సంగీతంతో ఎక్కడికో తీసుకెళ్లాడు. ముఖ్యంగా ఫైట్ సీక్వెన్సుల్లో పాత ‘జైలర్’ BGM మళ్లీ ఉపయోగిస్తూ ప్రేక్షకుల్లో ఊపు తెప్పించిన విధానం థియేటర్లను హోరెత్తించింది. దర్శకుడు నెల్సన్ బలమైన కథాబలం కంటే రజినీకాంత్ మాస్ ఇమేజ్, తన శైలి కామెడీ మీదే ఎక్కువగా ఆధారపడ్డాడు. రైటింగ్ మరింత పకడ్బందీగా ఉండి, రెండో భాగంలో వేగంపై కాస్త శ్రద్ధ పెట్టి ఉంటే సినిమా స్థాయి మరో రకంగా ఉండేది. విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా పనితనం ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో ఆకర్షణీయంగా చూపించింది. నిర్మాణ విలువలు కూడా ఎక్కడా రాజీ పడకుండా చాలా గొప్పగా ఉన్నాయి. అయితే ఎడిటర్ ఆర్. నిర్మల్ 3 గంటల నిడివిని కాస్త కుదించి, అనవసరపు సన్నివేశాలను తొలగించి ఉంటే సినిమా మరింత ఆసక్తికరంగా మారేది.
ఓవరాల్‌గా:
మొత్తంగా ‘జైలర్ 2’.. ముత్తువేల్ పాండియన్ షో..
