
ఒకప్పుడు తెలుగు బుల్లితెరపై కామెడీ అంటే జబర్దస్త్, జబర్దస్త్ అంటే కామెడీ అనే రేంజ్‌లో ఈ షో ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. కానీ రాను రాను ఈ షో టీఆర్పీ రేటింగ్స్ దారుణంగా పడిపోతూ వచ్చాయి. పడిపోతున్న ఈ కామెడీ షోను మళ్లీ పైకి లేపడానికి మేకర్స్‌కు ఇప్పుడు మళ్లీ పాత వాళ్లే దిక్కయ్యారు. ఒకప్పుడు మనకెందుకులే అని కాదని పోయిన చమ్మక్ చంద్ర, జడ్జి నాగబాబు లాంటి వాళ్లనే మళ్లీ మల్లెమాల టీమ్ వెనక్కి పిలుచుకుంది. ఒకప్పుడు వీళ్లంతా కలిసి జబర్దస్త్ స్టేజ్ మీద చేసిన మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు షో పరిస్థితి కాస్త డల్ అవ్వడంతో, మళ్లీ ఆ పాత వైభవం తీసుకురావడానికి ఎవర్నైతే వద్దనుకున్నారో వాళ్లనే తిరిగి సాదరంగా ఆహ్వానించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది చూస్తుంటే పాత చింతకాయ పచ్చడి ఎప్పటికీ టేస్టీగానే ఉంటుందని మల్లెమాల వాళ్లకు బాగా అర్థమైనట్లుంది.
జబర్దస్త్ షో మొదలైన కొత్తలో చమ్మక్ చంద్ర, ధన్‌రాజ్, చలాకీ చంటి లాంటి వాళ్ళంతా ఉన్నపుడు ఆ రికార్డు రేటింగ్స్ చూసి మిగతా ఛానెల్స్ వాళ్ళు భయపడిపోయారు. అప్పట్లో ప్రతీ గురు, శుక్రవారాలు వచ్చాయంటే చాలు ఫ్యామిలీ అంతా టీవీల ముందు అతుక్కుపోయేవాళ్లు. కానీ రోజులు గడిచే కొద్దీ మధ్యలో ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. ముఖ్యంగా యూత్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న సుడిగాలి సుధీర్ లాంటి వాళ్లు కూడా ఈ షోను మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇంకొంతమంది కమెడియన్స్ కూడా పక్క ఛానెల్స్‌కు క్యూ కట్టారు. అంతమంది వెళ్ళిపోయినా సరే, కేవలం హైపర్ ఆది మాత్రమే జబర్దస్త్ స్టేజ్ మీద ఉండిపోయి షోను తన భుజాల మీద మోస్తూ వచ్చాడు. కానీ ఒకే వ్యక్తి ఎన్ని రోజులు అలా షోను లాక్కొస్తాడు, అందుకే ఇప్పుడు మళ్లీ పాత టీమ్ అందరినీ రంగంలోకి దింపి షోను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అసలు ఇంతమంది ఆర్టిస్టులు ఈ రేంజ్ హిట్ షోను వదిలేసి వెళ్ళడానికి మెయిన్ రీజన్ రెమ్యునరేషన్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఆర్టిస్టుల వాదన ఎలా ఉందంటే, ఈ షో ద్వారా మాకు క్రేజ్ పెరిగింది, మా వల్లే టీఆర్పీ వస్తుంది కాబట్టి మా రేంజ్ పెరిగినపుడు ఆటోమాటిక్‌గా మా రెమ్యునరేషన్ కూడా పెంచాలి కదా అనేది వాళ్ళ పాయింట్. కానీ ప్రొడక్షన్ హౌస్ మల్లెమాల వాదన మాత్రం మరోలా ఉంటుంది. అసలు ఎవరికీ తెలియని మీకు అవకాశం ఇచ్చి స్టార్స్‌ను చేసింది మేమే కదా, అలాంటప్పుడు డబ్బుల కోసం పక్క ఛానెల్స్‌కు వెళ్ళడం కరెక్ట్ కాదు అనేది వాళ్ళ వెర్షన్. ఈ రెండు భిన్నమైన అభిప్రాయాల వల్లే ఇరువర్గాల మధ్య గ్యాప్ పెరిగిపోయింది. దాంతో ఎవరికి వారు తమ ఇగోలకు పోయి విడిపోయారు, ఫలితంగా షో రేటింగ్స్ క్రమంగా తగ్గుతూ వచ్చాయి.
అయితే ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది. బయటకు వెళ్లిన కమెడియన్స్‌కు పక్క ఛానెల్స్‌లో అవకాశాలు వచ్చినా, జబర్దస్త్ ఇచ్చినంత గుర్తింపు, ఆ బ్రాండ్ ఇమేజ్ మాత్రం దక్కలేదు. అందుకే ఇప్పుడు మళ్లీ పాత వాళ్ళందరూ మల్లెమాల వైపు అడుగులు వేస్తున్నారు. పక్క ఛానెల్స్‌కు వెళ్లిపోయిన చలాకీ చంటి లాంటి వాళ్లు కూడా ఇప్పుడు తిరిగి జబర్దస్త్ కామెడీ షోలో కనిపిస్తున్నారు. ఆయనతో పాటు ధన్‌రాజ్ కూడా మళ్లీ ఎంట్రీ ఇచ్చి తన మార్క్ కామెడీతో నవ్విస్తున్నాడు. వీళ్ళు మాత్రమే కాదు, షోను వదిలేసి వెళ్లిపోయిన ఇంకా చాలా మంది ఆర్టిస్టులు ఇప్పుడు మళ్లీ తమ పాత గూటికి చేరుకుంటున్నారు. మల్లెమాల యాజమాన్యం కూడా పాత గొడవలను పక్కనపెట్టి షోను బతికించుకోవాలనే ఉద్దేశ్యంతో వాళ్ళందరినీ తిరిగి కలుపుకుపోతోంది.
మొత్తానికి జబర్దస్త్ స్టేజ్ మీద ఇప్పుడు మళ్లీ ఆ పాత కళ స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మెగా బ్రదర్ నాగబాబు లాంటి సీనియర్ జడ్జి తిరిగి రావడం ఈ షోకు పెద్ద ప్లస్ అని చెప్పాలి. అలాగే లేడీ గెటప్స్ వేయడంలో ఒక ట్రెండ్ సెట్ చేసిన చమ్మక్ చంద్ర మళ్లీ తన స్కిట్స్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయడానికి రెడీ అయ్యాడు. అయితే ఇక్కడే ఒక పెద్ద సందేహం అందరిలోనూ మొదలైంది. చంద్ర, నాగబాబు, ధన్‌రాజ్, చంటి లాంటి వాళ్ల రాకతో మళ్లీ జబర్దస్త్ కామెడీ షోకు ఆ పాత పునర్వైభవం వస్తుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే ప్రేక్షకుల టేస్ట్ ఇప్పుడు బాగా మారిపోయింది, వాళ్లకు తగ్గట్టుగా కంటెంట్ లో కూడా కొత్తదనం చూపిస్తేనే ఈ పాత టీమ్ మళ్లీ క్లిక్ అవుతుంది. మరి ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో వీళ్లంతా కలిసి మునుపటి లాగే బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొడతారో లేదో వేచి చూడాలి.
