Don't Trouble The Trouble Review
రాజమౌళి కుటుంబం నుంచి ఓ సినిమా వస్తుందంటే అందరి చూపులు అక్కడే ఉంటాయి. అలా వచ్చిన సినిమానే డోంట్ ట్రబుల్ ది ట్రబుల్. రాజమౌళి బంధువు శశాంక్ ఏలేటి ఈ సినిమాను తెరకెక్కించాడు. ఎస్ ఎస్ కార్తికేయ నిర్మించిన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:
అనాథగా పెరిగిన సూరి (ఫహాద్ ఫాజిల్) అంబులెన్స్ నడుపుతూ, చేతికి అందిన ప్రతి చిన్న పనీ చేస్తూ పొట్టపోసుకుంటుంటాడు. ఆ క్రమంలో దివ్య (సారా పలేకర్) అనే చిన్నారి అతనికి పరిచయం అవుతుంది. ఆ పాపను కిడ్నాప్ చేసి డబ్బులు గుంజాలని సూరి ప్లాన్ వేస్తాడు. మరోపక్క, తన పేరెంట్స్‌ను తానే ఏదో మాయ చేసి మాయం చేశానని ఆ చిన్నారి భ్రమపడుతుంటుంది. వీరిద్దరి ప్రయాణంలో ఓ షాకింగ్ నిజం బయటపడుతుంది. దివ్య ప్రాణాలతో లేదని, ఆమె అదృశ్య శక్తి అని సూరికి అర్థమవుతుంది. పాపకు ఉన్న అతీంద్రియ శక్తులను తన అవసరాలకు వాడుకుంటూనే, ఆ పాపను తల్లిదండ్రులతో కలుపుతానని మాట ఇస్తాడు. ఆ తర్వాత సూరి ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి, దివ్య గతం ఏంటి, ఆమె పేరెంట్స్ ఏమయ్యారు అనేది వెండితెరపై చూడాల్సిందే.

స్క్రీన్ ప్లే:
చిన్నప్పుడు మనం చదువుకున్న చందమామ కథలు గుర్తున్నాయి కదా.. అలాగని ఈ సినిమా అంత అద్భుతంగా ఉంటుందని కాదు.. జస్ట్ రిఫరెన్స్ కోసం అంతే. ఒక ఆత్మతో మనిషి చేసే ప్రయాణమే ఈ చిత్రం. కాకపోతే దర్శకుడు ఎంచుకున్న పాయింట్ బాగానే ఉన్నా, దాన్ని తెరపై చెప్పిన విధానం మాత్రం ఆకట్టుకోలేదు. మొదటి ఇరవై నిమిషాలు ఆసక్తికరంగానే సాగుతుంది. కానీ పాప ఎంట్రీ తర్వాత కథలో వేగం పెరగాల్సింది పోయి, ఎక్కడికక్కడే సాగదీసినట్లు అనిపిస్తుంది. ఇంటర్వెల్ వరకు ఒకే సీన్ మళ్లీ మళ్లీ వస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. విరామం దగ్గర ఇచ్చిన ట్విస్ట్ అదిరిపోయినా.. సెకండాఫ్‌లోనూ అదే స్లో నెరేషన్ ప్రేక్షకులను బాగా ఇబ్బంది పెడుతుంది. పైగా హీరో క్యారెక్టరైజేషన్ చూస్తే చివరి వరకు డబ్బు కోసం ఏమైనా చేస్తాడన్నట్లే ఉంటుంది. కనీసం ఆ చిన్నారి మనిషి కాదని తెలిసిన తర్వాతైనా ఎమోషన్స్ మీద కాస్త ఎక్కువ ఫోకస్ చేసుంటే బాగుండేది. అలాంటి స్వార్థపరుడైన మనిషి, ఎలాంటి కారణం లేకుండా ఉన్నపలంగా మంచోడిగా మారిపోవడం, పాప కోసం ప్రాణాలిచ్చేంతగా తెగించడం ఏమాత్రం కన్విన్సింగ్‌గా అనిపించదు. వాళ్లిద్దరి మధ్య ముందే ఒకట్రెండు బలమైన ఎమోషనల్ సన్నివేశాలు పడి ఉంటే సినిమా రేంజ్ కచ్చితంగా మారిపోయేది. ప్రీ క్లైమాక్స్ వరకు బలవంతంగా కథను లాక్కొచ్చిన దర్శకుడు శశాంక్, చివరి 15 నిమిషాలు మాత్రం పూర్తిగా ఎమోషన్స్ పండించి మెప్పించాడు.
నటీనటులు:
సూరి క్యారెక్టర్‌కు ఫహద్ ఫాసిల్ నూటికి నూరు శాతం న్యాయం చేశాడు. తనదైన టైమింగ్‌తో కామెడీ పండిస్తూనే, ముగింపులో కంటతడి పెట్టిస్తాడు. సినిమాకు మెయిన్ పిల్లర్ చిన్నారి సారా పాలేకర్. దివ్య పాత్రలో ఆ పాప నటన అద్భుతంగా ఉంటుంది, సినిమా అంతా తన చుట్టూనే తిప్పుకుంటుంది. హీరో స్నేహితుడిగా వెంకటేష్ కాకుమాను తన పరిధి మేరకు అలరించాడు. మిగిలిన సపోర్టింగ్ రోల్స్‌లో సుబ్బరాజు, బాలీవుడ్ యాక్టర్ సౌరభ్ సచ్‌దేవా, మహేష్ మంజ్రేకర్, విమలా రామన్ తదితరులు తమ పాత్రలకు తగ్గట్లుగా ఒదిగిపోయారు.

టెక్నికల్ టీం:
ఈ ఫాంటసీ డ్రామాకు కాలభైరవ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రధాన బలం. పాటల సంఖ్య తక్కువే ఉన్నా, BGMతో మాత్రం సన్నివేశాలను బాగా ఎలివేట్ చేశాడు. సినిమాటోగ్రాఫర్ బ్రాడ్ ఫ్రాన్సిస్ కెమెరా వర్క్, విజువల్ ఎఫెక్ట్స్ సినిమాకు రిచ్ లుక్ తీసుకొచ్చాయి. అయితే ఎడిటర్ ప్రవీణ్ ఆంథోని నిడివి విషయంలో జాగ్రత్త పడాల్సింది. సాగదీత సీన్స్ కొన్ని ట్రిమ్ చేసుంటే సినిమా మరింత క్రిస్పీగా ఉండేది. కొత్త దర్శకుడు శశాంక్ యేలేటి ఎంచుకున్న పాయింట్ బాగున్నా, తెరపై దాన్ని ఆవిష్కరించడంలో అక్కడక్కడా తడబడ్డాడు. నిర్మాత కార్తికేయ నిర్మాణ విలువలు ఎక్కడా రాజీ పడకుండా చాలా ఉన్నతంగా ఉన్నాయి.
చివరగా:
స్లో నెరేషన్, లాజిక్స్ పక్కనపెడితే.. క్లైమాక్స్‌లో ఎమోషన్‌తో మెప్పించే డీసెంట్ ఫాంటసీ డ్రామా..
